Gongura Pulusu Recipe / Gongura Kura / Gongura Curry / Gongura Rasam:
గోంగూర ఆహా… పేరు వినగానే చాలా మందికి నోళ్ళల్లో నీళ్ళు ఊరేవుంటాయి. తెలుగు వారికి గోంగూర కి విడతీయరాని అనుభందం ఉన్నది.
పంచ భక్ష పరమన్నాలు పళ్ళెం లో ఉన్న గోంగూర కోసం వెతుకు వాడు తెలుగు వాడు అని ఒక మహా కవి అన్నాడు. అంటే తెలుగు వారికి గోంగూర అంటే అంత ప్రత్యేకత మరి. ఎలాంటి శుభకార్యమైన గోంగూర ఉండాల్సిందే.
ఆంధ్ర ప్రాంతం లో గోంగూర అని పిలిస్తే తెలంగాణ వైపు పుంటి కూర (Gongura Kura / Gongura Curry) అని పిలుస్తారు. ఏ ప్రాంతం వారికైనా ఇది ప్రత్యేకమైన వంటకం అని చెప్పక తప్పదు. అలాంటి గోంగూరతో పచ్చడి మాత్రమే ఇప్పడి వరకు తిని ఉంటారు. ఇప్పుడు కాస్త కొత్తగా పులుసు చేసి చూద్దాం.
గోంగూర పులుసు తయారు చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్:
- గోంగూర పచ్చడికి అయితే ముదిరిన ఆకు అయితే బాగుంటుంది. కానీ సాంబార్ కి లేత ఆకు అయితేనే సాంబార్ లో త్వరగా ఉడుకుటుంది . పైగా లేత ఆకు వలన సాంబార్ మంచి పుల్లటి రుచి వస్తుంది.
- గోంగూర ఆకులు తుంచుకున్న తరువాత కనీసం గా 4 నుంచి 5 సార్లు బాగా ఇసుక లేకుండా కడగాలి.
- అప్పుడే కోసిన లేత గోంగూర అయితే మరింత రుచిగా ఉంటుంది.
- సాధారణంగా పులుసు ని చింతపండు రసం వేసి తాలింపు పెట్టి మరిగించి చేస్తారు. అది బాగానే ఉంటుంది కానీ అంతా చిక్కగా ఉండదు. తినేప్పుడు అన్నానికి పట్టదు అలా కాకుండా పులుసు మరింత చిక్కగా రావాలి అంటే కొద్దిగా బియ్యం పిండి కానీ శనగ పిండి కానీ నీళ్ళల్లో కలిపి పోయాలి. దీని వల్ల సాంబార్ చిక్కగా వస్తుంది.
- శనగ పిండి గాని, బియ్యం పిండి గాని కలుపు కునేప్పుడు అలానే పొడి పిండి వేస్తే గడ్డలు కడుతుంది. పిండి మొత్తం కలవదు. అలా కాకుండా పిండి లో కాసిన్ని నీళ్ళు పోసి జారుగా కలుపుకొని సాంబార్ లో పోసుకుంటే పిండి మొత్తం కలిసిపోతుంది.
- పులుసు అంటేనే చింతపండు రసం పోసి చేస్తాము. కానీ గోంగూరనే పుల్లగా ఉంటుంది కనుక చింతపండు అవసరం లేదు అనుకోకండి . చింత పండు వేయడం వల్ల మరింత రుచి వస్తుంది. చింత పండు పులుపు రుచి వేరు కదా మరి.
- ఇందులో శనగ పప్పు అలానే వేయకుండా ఒక గంట పాటు నానపెట్టి వేయడం వల్ల బాగా ఉడుకుటుంది. లేదంటే అలానే పలుకు పలుకుగా ఉండి పోతుంది.
గోంగూర పులుసు | గోంగూర రసం | గోంగూర సాంబార్ రెసిపీ తయారీ విధానం
Ingredients
- 2 కప్పులు తరిగిన గోంగూర ఆకులు
- 1 కప్పు పెద్దగా కోసిన ఉల్లిపాయ ముక్కలు
- 3 టమాటలు
- ¼ కప్పు శనగ పప్పు
- చింత పండు పెద్ద నిమ్మ పండు సైజు
- 1 టేబుల్ స్పూన్ శనగ పిండి
- ½ కప్పు నూనె
- 1 టీ స్పూన్ ఆవాలు
- 1 టీ స్పూన్ జీలకర్ర
- ½ టీ స్పూన్ పసుపు
- 6 వెల్లుల్లి రెబ్బలు
- ½ టీ స్పూన్ ఇంగువ
- 4 రెబ్బలు కరివేపాకు
- ¼ కప్పు కొత్తిమీర తరుగు
- 4 ఎండు మిర్చి
- 1 టేబుల్ స్పూన్ కారం
- 2 టీ స్పూన్ మినప పప్పు
- 2 టీ స్పూన్ ధనియాలు
Instructions
- ముందుగా శనగ పప్పును బాగా కడిగి ఒక గంట పాటు నాన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ముందుగా నాన పెట్టుకున్న శనగ పప్పు, గోంగూర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా నీళ్ళు పోసి మూతపెట్టి ఒక 3 అంటే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- స్టౌ పైన ముకుడు పెట్టి అందులో తాళింపుకు సరిపడా నూనె పోసి నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపపప్పు, ధనియాలు వేసి కాస్త చితపడ లాడించాలి.
- ఇప్పుడు అందులోనే ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లి పాయలు, కరివేపాకు వేసి మూతపెట్టి ఉల్లి పాయలు మగ్గే వరకు ఉడకనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన తాలింపు మరింత రుచి వస్తుంది . కొందరికి వెల్లుల్లి ఇష్టం ఉండదు . అలా అనుకున్న వాళ్ళు వేసుకోక పోయిన పరవాలేదు.
- ఉల్లి పాయలు నూనెలో బాగా మగ్గిన తరువాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసి చిక్కగా పీసీకి పెట్టుకున్న చింత పండు రసం పోసి రసం కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి.
- చింతపండు రసం దగ్గర పడుతున్న సమయం లో ముందు ఉడికించి పెట్టుకున్న పప్పును పప్పు గుత్తితో బాగా మెతుపుకొని మరుగుతున్న చింతపండు రసం లో పోసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు సన్నని మంటపై మరగానివ్వాలి.
- ఇప్పుడు 2 టీ స్పూన్ ల శనగ పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి కొద్దిగా జారుగా కలుపుకొని మరుగుతున్న సాంబార్ లో పోసుకొని పిండి మొత్తం కలిసేంత వరకు మరగనివ్వాలి. ఇక్కడ శనగ పిండి నచ్చని వారు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు.
- బాగా మరిగిన దీనిలో కొద్దిగా ఇంగువ వేసి ,ముందుగా వేసిన ఉప్పు సరిపోక పోతే మరలా కొద్దిగా వేసి చివరగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే సరి ఎంతో పుల్లపుల్లగా రుచిగా ఉండే గోంగూర రసం రెడీ.
Notes
మీరు ఈ రెసిపీని చదివినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ రెసిపీని తయారు చేసి, దాని రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ తో పాటు వాటియొక్క విశేషతలు, చిట్కాలు, పోషకాల వివరాలు, మరియు వాటియొక్క ఆరోగ్యప్రయోజనాలను మీరు మీ WhatsApp ద్వారా పొందాలంటే ఇప్పుడే మా WhatsApp ఛానల్ ని Follow చెయ్యండి.