మైసూర్ బోండా ( Mysore bonda ) .... వినగానే దీనిలో కొత్తేం ఉంది ప్రతి హోటల్ లో దొరికేదే కదా అని అనుకుంటారేమో అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇవి మనకు దొరికే మామూలు మైసూర్ బొండా కాదు . గోదుమ పిండి తో చేసే మైసూర్ బోండా. మనం గోధుమ పిండితో సహజం గా చపాతీలు చేసుకుంటాం . కానీ ఇప్పుడు మైసూర్ బోండాలనుకూడా చేసి చూద్దాం . ఇవి అచ్చం మనకు బయట దొరికే మైసూర్ బోండా లాగే ఉంటుంది .
ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వంట సోడా వేయాలి . వంట సోడా ఎప్పుడు కూడా తాజాది తీసుకోవాలి అప్పుడే బొండాలు బాగా పొంగుతాయి . వంట సోడా వేసిన దాని లోనే అరకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి . పుల్లటి పెరుగు అయితే మరి మంచిది . సోడా ,పెరుగు కలిసి బాగా పొంగుతుంది . ఆ తర్వాత దానిలోనే బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి ఇందులోనే గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్ళు పోసి మరి జారుగా కాకుండా బోండా కి అవసరమయ్యే విధం గా పిండిని కలుపుకోవాలి .400 గ్రాముల పిండికి సరిగ్గా అరలీటరు నీళ్ళు అవసరమవతాయి.
ఈ పిండి నంతా బాగా 10 నిమిషాల పాటు బాగా గిలకొట్టుకోవాలి . ఇక్కడ ఒక విషయం గుర్తుపెటుకోవాలి . పిండిని ఎంత బాగా గిలకొట్టుకుంటే గాలి పిండి లోకి అంతా బాగా చొరబడి పిండి బాగా పొంగుతుంది . బొండాలు బాగా గుండ్రం గా మెత్తగా వస్తాయి . బోండాలు బాగా రావడం రాకపోవడం అనేది అంతా మనం పిండి ని గిలకొట్టుకోవడం లోనే ఉంది . కొద్దిగా నీటిని చేతికి తగిలించుకొని గిన్నె అంచులకు పట్టిన పిండిని అంతా శుభ్రం చేసుకోవాలి . లేదంటే ఆ పిండి అంతా ఎండి పొయ్యి బోండా పిండిలో కలిసి బొండాలు వేసే సమయం లో ఇబ్బంది అవుతుంది . ఇలా గిల కొట్టుకున్న పిండి ని ఒక 2 గంటల పాటు అలానే వదిలేయాలి .
ఇప్పుడు 2 గంటలు బాగా నానిన పిండిని తీసుకొని ఒక సారి బాగా కలిపి అందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు తిరుము ,కొత్తిమీర తురుము ,జీలకర్ర వేసి మరో 10 నిమిషాలు గిలకొట్టి పక్కన పెట్టాలి .
స్టౌ పైన కడాయి పెట్టి అందులో బోండాలు వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి . కడాయి మరి సన్నది కాకుండా లావు పాటిది అయితే బొండాలు మాడిపోకుండా ఉంటాయి . కొద్దిగా లోతుగా ఉన్న కడాయి అయితే బోండాలు నూనెలో మునిగి బాగా కాలతాయి .
నూనె వేడయ్యాక బోండా పిండిని తీసుకొని మామూలు బొండాలు వేసుకున్నట్టే వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి . సన్నని మంట పైననే బోండాలను వేయించుకోవాలి . అప్పుడే బోండా లోపలి వరకు బాగా కాలుతుంది . పెద్ద మంట పై అయితే బాగానే కలుతుంది కానీ లోపల అంతా పిండి పిండి గానే ఉంటుంది .
కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఎన్ని కావాలి అంటే అన్ని బోండాలు వేసుకోవడమే అంతే ఎంతో రుచిగా కొత్తగా అనిపించే గోధుమ పిండి బొండాలు రెడీ .
Video
Notes
చూశారు కదా .. కొత్తగా ఎప్పుడు తినని గోధుమ పిండి బోండాలు .. మరిన్ని మంచి రుచులకు మా చెఫ్ సరు వెబ్ సైట్ ని వీక్షించండి . మీ సూచనలు ,సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి .